న్యూఢిల్లీ: ఒకే ఇంటిలో ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు కేంద్రం షాకిచ్చింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్ఠంభనతో ఎల్పీజీ దిగుమతి గణనీయంగా తగ్గిపోయిన క్రమంలో గ్యాస్ వినియోగాన్ని నియంత్రించడానికి ఒక కుటుంబానికి ఒకటే గ్యాస్ కనెక్షన్ నిబంధన అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒకే ఇంటిలో ఒకటి కన్నా ఎక్కువగా బహుళ గ్యాస్ కనెక్షన్లు ఉంటే అది చట్ట విరుద్ధమని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, భారత్ పెట్రోలియం గ్యాస్ వినియోగదారులను ఉద్దేశించి ఉమ్మడి ప్రకటన చేశాయి.
నూతన నిబంధనలను అనుసరించి వినియోగదారులు తమ వద్ద అదనంగా ఉన్న గ్యాస్ సిలిండర్లను వెంటనే అప్పగించాలని విజ్ఞప్తి చేశాయి. ఒక వంట గదితో ఉండే ఒక కుటుంబం (భర్త, భార్య, పెళ్లయిన పిల్లలు, తల్లిదండ్రులు)కు ఒక్క ఎల్పీజీ కనెక్షన్‌ను మాత్రమే అనుమతిస్తారు. అంతే కాకుండా అదనపు సిలిండర్లను కనుక కంపెనీలకు అప్పగించకపోతే వారి అసలు కనెక్షన్‌కు కూడా గ్యాస్ సరఫరా నిలిపివేస్తారు. సిలిండర్లను అప్పగించిన తర్వాతే సరఫరాను పునరుద్ధరిస్తారు. అయితే అదనపు సిలిండర్‌ను తిరిగి అప్పగించిన తర్వాత వినియోగదారులు ఒక బ్యాకప్ సిలిండర్ కోసం డబుల్ బాటిల్ కనెక్షన్‌గా మార్చుకోవడాన్ని ఎంచుకోవచ్చు.
ఒక వేళ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్‌ను కనుక పొందదలిస్తే తమ ఎల్పీజీ కనెక్షన్‌ను 30 రోజుల్లోగా అప్పగించాలి. ప్రత్యామ్నాయంగా వారు బదిలీ వోచర్‌ను అభ్యర్థించ వచ్చు. దీని ద్వారా పీఎన్జీ అందుబాటులో లేని ప్రాంతంలో ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి క్రియాశీలం చేయడం సాధ్యమవుతుంది. గ్యాస్ వినియోగాన్ని నియంత్రించడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది.