న్యూఢిల్లీ: ఢిల్లీలో పొల్యూషన్ పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. దీపావళి పటాకులతో అక్కడ గాలి తీవ్ర కాలుష్యంతో నిండిపోయింది. ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు దారి తీసే కాలుష్య కారకాలు(Pollution Particles) తారాజువ్వాలా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లోనే ఆ విషపూరిత పదార్ధాలు గాలిలో 140 శాతం పెరిగినట్లు కేంద్రం కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొన్నది.
గాలిలో ఉండే పార్టికల్స్‌లో పీఎం 2.5 స్థాయి చాలా ప్రమాదకరమైందని, అయితే ఆ ధూళి ప్రస్తుతం గాలిలో దుమ్మురేగిపోయినట్లు సీపీసీబీ అంచనా వేసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు 83.5గా ఉన్న పార్టికల్స్ సంఖ్య.. ఇవాళ ఉదయం 7 గంటలకు 200.8గా రికార్డు అయినట్లు కాలుష్య బోర్డు తెలిపింది. ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర అవయవాలను నిర్వీర్యం చేయడంలో పీఎం 2.5 పార్టికల్స్ చాలా కీలకమైనవి.
నిజానికి ఆదివారం ఉదయం ఢిల్లీ వెదర్ బాగుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత అక్కడి వాయు నాణ్యత బెస్ట్‌గా రికార్డు అయ్యింది. కానీ ఇవాళ ఉదయం మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. ఒక్క రోజులోనే సీన్ రివర్స్ అయ్యింది. చాలా ప్రదేశాల్లో ఏక్యూఐ 500 దాటినట్లు పొల్యూషన్ బోర్డు రికార్డులు చెబుతున్నాయి. లజ్‌పత్ నగర్, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతాల్లో ఏక్యూఐ 900 దాటినట్లు కొన్ని రిపోర్టులు వెల్లడించాయి.