SKM | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్రంలో మోదీ సర్కార్ విధానాల్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహిస్తారని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ప్రకటించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన వెంటనే ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని తెలుపుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ పరేడ్‌ను విజయవంతం చేయాలని దేశవ్యాప్తంగా రైతుల్ని కోరింది.
‘అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్ చేపడతాం. ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో రైతులు పరేడ్‌లో పాల్గొనవచ్చు. ఈ సం దర్భంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరిలిజం, సోషలిజం సూత్రాల్ని పరిరక్షిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేయనున్నారు’ అని ఎస్కేఎం తెలిపింది. మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల్ని సామాన్యులకు వివరిస్తూ జనవరి 10-20 మధ్య 20 రాష్ర్టాల్లో ‘జన జాగరణ్’ను చేపడుతున్నట్టు తెలిపింది. రైతుల డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎస్కేఎం స్పష్టం చేసింది.