Caste census : దేశవ్యాప్తంగా కుల గణన (Caste census) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఇవాళ ఆమోదం తెలిపింది. వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తమ విజయంగా చెప్పుకుంటున్నాయి. ఈ మేరకు ప్రధానపక్షం కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ వేర్వేరుగా ప్రకటనలు చేశాయి.
ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని కులగణనకు తలొగ్గేలా చేయడంలో తాము విజయం సాధించామని ప్రకటించాయి. బీహార్లో కుల గణన జరగడానికి, ఇప్పుడు దేశవ్యాప్త కులగణనకు కేంద్ర ఒప్పుకోవడానికి తమ పోరాటమే పని చేసిందని చెప్పుకుంటున్నాయి. బీహార్లో ఈ ఏడాది ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కుల గణనకు చేపట్టనున్నామనే అంశాన్ని అధికార ఎన్డీఏ, కేంద్రం కులగణనకు తలొగ్గేలా చేశామనే విషయాన్ని ఆర్జేడీ, కాంగ్రెస్ తమ ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నాయి.