బెంగళూరు, జనవరి 17: కర్ణాటకలోని బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. బెంగళూరు రద్దీ రోడ్డుపై 71 ఏండ్ల వృద్ధుడిని బైక్‌తో యువకుడు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాహిల్ అనే యువకుడు నిర్లక్ష్యంగా స్కూటర్ నడుపుతూ కారును ఢీకొట్టాడు. కారు నడుపుతున్న వృద్ధుడు దిగి సాహిల్‌ను నిలదీశాడు. అతడు పట్టించుకోకుండా వెళ్లిపోతుండడంతో స్కూటర్‌ను ఆపేందుకు వృద్ధుడు ప్రయత్నించాడు. అయితే, సాహిల్ అలాగే స్కూటర్‌ను పోనిచ్చాడు. వృద్ధుడు స్కూటర్ వెనుకనే వేలాడుతూ వస్తున్నా పట్టించుకోలేదు. చివరకు కొంతమంది అతడిని అడ్డగించగా స్కూటర్ ఆపాడు. వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి ఫిర్యాదు మేరకు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.