అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేను (AAP MLA Chaitar Vasava) పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్మదా జిల్లాలోని దేడియాపడా నియోజకవర్గం పరిధిలో శనివారం ఒక సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే చైతర్ వాసవ ఇందులో పాల్గొన్నారు. సమన్వయ కమిటీలో సభ్యుడిగా తనను నియమించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సగ్బారా తాలూకా పంచాయతీ మహిళా అధ్యక్షురాలిని దుర్భాషలాడారు.
కాగా, దేడియాపడ తాలూకా పంచాయతీ అధ్యక్షుడు సంజయ్ వాసవ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే చైతర్ మొబైల్ ఫోన్ విసిరడంతో అతడి తలకు గాయమైంది. ఆ తర్వాత గ్లాస్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే పగిలిన గాజు గ్లాస్ పెంకుతో తనను చంపుతానని ఎమ్మెల్యే చైతర్ వాసవ బెదరించినట్లు పంచాయతీ అధ్యక్షుడు సంజయ్ వాసవ ఆరోపించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలోని కుర్చీని కూడా ఆ ఎమ్మెల్యే ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి వేళ ఎమ్మెల్యే చైతర్ వాసవను అరెస్ట్ చేశారు. దీంతో దేడియాపడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జనం గుమిగూడటంపై ఆంక్షలు విధించారు.
Also Read:
Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్
Watch: రైలు పట్టాలపై ఆటో నడిపిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?