న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఒమిక్రాన్ కారణంగా ఇండియాలో జనవరి మొదటి వారంలో మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. కరోనా కేసులు ఫిబ్రవరి చివరి వారంలో గరిష్ఠ స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నది. అయితే సెకండ్ వేవ్‌తో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చని తెలిపింది. డెల్టా వేరియంట్ సమయంలో చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని గుర్తు చేసింది. ‘దేశంలో వ్యాక్సినేషన్ మార్చిలో ప్రారంభమైంది. డెల్టా వేరియంట్ వచ్చేటప్పటికి చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు. దీంతో ఉద్ధృతంగా వ్యాపించింది. ప్రస్తుతం భారత్‌లో సీరో పాజిటివిటీ రేటు 75-80 శాతం మధ్యలో ఉంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహజ నిరోధకత ఉంది. 85% మంది ఒక్క డోసు టీకా వేసుకొన్నారు. సగం మంది రెండు డోసులు వేసుకొన్నారు. ఎంత పరిస్థితి చేయిదాటిపోయిందని అనుకొన్నా రోజువారీ కేసులు 2 లక్షలు దాటవు’ అని కమిటీ హెడ్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ అన్నారు. వైరస్ వ్యాప్తిపై అంచనాల కోసం కేంద్రం నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తదితరులు ఉన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌తో భారత్‌లో పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. యూకేలో కేసుల ఉద్ధృతిని బట్టి భారతదేశంలో వైరస్ వ్యాప్తిని పోల్చి చూడలేమని చెప్పారు. ‘యూకేలో సీరో పాజిటివిటీ రేటు తక్కువ. గతంలో అక్కడ తక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది. ఇండియాలో సీరో పాజిటివిటీ రేటు ఎక్కువ ఉంది. చాలా మంది వైరస్ బారిన పడి కోలుకొన్నారు. వారిలో యాంటిబాడీలు ఉన్నాయి. దీంతో ముప్పు పెద్దగా ఉండకపోవచ్చు’ అని అంచనా వేశారు. యూకేలో వేస్తున్నవి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అని, అవి స్వల్పకాలమే రక్షణ ఇస్తాయని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలిసి సూపర్ స్ట్రెయిన్‌గా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాల్ బర్టన్ అభిప్రాయపడ్డారు. ఒకే వ్యక్తికి ఒకే సమయంలో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ రెండూ సోకితే రెండు వేరియంట్లు పరస్పరం జన్యువులను మార్చుకొని అతని నుంచి సూపర్ స్ట్రెయిన్ తయారు కావొచ్చన్నారు. ఈ మేరకు యూకే పార్లమెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీకి వివరించారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని పేర్కొన్నారు. ఇంతకు ముందు వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్లు 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడించింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు 126కు చేరాయి. శనివారం కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో తాజాగా నమోదైన మూడు కేసులతో మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, తెలంగాణలో 8, గుజరాత్లో 7, ఏపీ, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్లో ఒక్కో కేసు చొప్పున కేసులు నమోదయ్యాయి.
మానవ జాతికి ప్రమాదకరమైన వైరస్‌లపై అధ్యయనం చేసేందుకు త్వరలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ కొత్త ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన వైరస్లు, మానవులపై వాటి ప్రభావం, వాటి నుంచి ఏవిధంగా రక్షణ పొందాలనే దానిపై ఈ అడ్వాన్స్డ్ బయలాజికల్ డిఫెన్స్ రిసెర్చ్ సెంటర్ దృష్టి సారిస్తుందని సంస్థ డైరెక్టర్ మన్మోహన్ పరీదా తెలిపారు. భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు డిఫెన్స్ ల్యాబ్‌లు కృషి చేస్తున్నాయన్నారు.