శ్రీనగర్, అక్టోబర్ 16: జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో 370వ అధికరణ రద్దు తర్వాత ఏర్పడిన యూటీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒమర్‌తో పాటు ఐదుగురు మంత్రుల (వీరిలో ఒకరు మహిళ)తో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. వీరిలో సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాగా, ఎన్సీ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో భాగం పంచుకోలేదు.
ఒమర్ ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తామని ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించక పోవడం పట్ల తాము సంతోషంగా లేమని ఆ పార్టీ పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. అంతకుముందు ఆయన 2009 నుంచి 2014 వరకు పూర్తి రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన తాత షేక్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా గతంలో జమ్ముకశ్మీర్‌కు ముఖ్యమంత్రులుగా చేశారు.
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి పదవి ఒక ముళ్ల కిరీటం లాంటిదని ఎన్సీ అధినేత ఫరూక్ అ బ్దుల్లా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ముందుకు వెళ్లే దారంతా పూర్తి అడ్డంకులతో నిండి ఉందని, ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.