న్యూఢిల్లీ: అమెరికా ఆంక్షలకు గురైన ఇరాన్ ముడి చమురు తీసుకెళ్తున్న ఒక చమురు ట్యాంకర్ ప్రయాణం మధ్యలో దారి మళ్లించుకొని భారత్కు కాకుండా చైనా దారి పట్టింది. గత ఏడేండ్లలో ఇలా జరగడం ఇది తొలిసారి. నౌకల కదలికలను పర్యవేక్షించే ఓ సంస్థ కథనం ప్రకారం.. పింగ్ షన్ అనే ట్యాంకర్ ఈ వారం ప్రారంభంలో గుజరాత్లోని వడినార్కు రావాల్సి ఉంది. అయితే అది చైనాలోని డాంగ్ఇంగ్ను గమ్య స్థానంగా చేసుకొన్నట్టు సంకేతాలను పంపుతున్నది.
చాలా వాణిజ్య నౌకలకు తప్పనిసరి అయిన ట్రాకింగ్ వ్యవస్థ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సూచించే గమ్యస్థానమే అంతిమమైనదని.. ప్రయాణ సమయంలో అది ఎప్పుడూ మారకపోవచ్చని ఎలాంటి నిర్ధారణ లేదు. ఇటీవల అమెరికా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో భారత రిఫైనరీలు ఇరాన్ చమురును కొనుగోలు చేసి సముద్ర మార్గంలో తెప్పించుకొనే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి.