బెంగళూరు, అక్టోబర్ 1: కర్ణాటక ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు వెనక్కి తీసుకున్నారు. ముడా కుంభకోణం నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని సీఎం భార్య సోమవారం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 14 ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ సేల్డీడ్ను రద్దు చేయాలని ముడా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర మంగళవారం మాట్లాడుతూ పార్వతి 14 స్థలాలను ముడాకు అప్పగించడానికి సిద్ధపడ్డారంటే ముడా కుంభకోణంలో తప్పు జరిగిందని అధికారికంగా ఒప్పుకున్నట్టేనని అన్నారు. వెంటనే సీఎం సిద్ధూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముడా కుంభకోణంలో తనకు ఎలాంటి పాత్ర లేనందున తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసలు ఏ కారణాలతో తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు మోపారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. భూములు అప్పగించినంత మాత్రాన నేరం ఒప్పుకున్నట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. విపక్షాల రాజకీయాలకు తన భార్య కూడా పావుగా మారిందని, భూములు అప్పగించాలని తీసుకున్న నిర్ణయం ఆమె సొంతమని, దానిలో తన ప్రమేయం ఏమీ లేదని తెలిపారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్వేష రాజకీయాలకు తన భార్య బాధితురాలిగా మారిందని, భూములు అప్పగించాలన్న ఆమె నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.
ముడా స్కామ్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న సిద్ధరామయ్యను ప్రశ్నించడానికి ఏ క్షణంలోనైనా ఈడీ సమన్లు జారీ చేయొచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. సిద్ధరామయ్యతో పాటు, అతని సహచరులు, బంధువులు, సన్నిహితంగా మెలిగే ఒక మంత్రి కదలికలను అధికారులు ఇప్పటికే నిశితంగా పరిశీలిస్తున్నారు. వారికి చెందిన బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఈడీ సేకరించింది. మరోవైపు లోకాయుక్త బృందం మైసూర్ నగర శివారులో ఉన్న ముడా స్కామ్ వివాదాస్పద భూమిలో సర్వే నిర్వహించారు.