Anant weds Radhika | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చిన్నకుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ వివాహం ఈనెల 12న ముంబైలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వివాహ వేడుకలకు దేశంతోపాటు అంతర్జాతీయ ప్రముఖులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వివాహం జరిగే ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలో (Bandra Kurla Complex) పోలీసులు మూడు రోజులపాటు పలు ఆంక్షలు కూడా విధించారు.
వివాహ వేడుకల కారణంగా కుర్లా ప్రాంతంలో సాధారణ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వాణిజ్య కార్యాలయాలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో తమ ఉద్యోగులను వర్క్‌ఫ్రం హోం చేయాలని (Offices go remote) సూచించాయి. ఈ నెల 15వ తేదీ వరకూ ఇంటి నుంచి పని చేయమని తమ ఉద్యోగులను కోరాయి.
హోటల్ గదులకు రెక్కలు..
మరోవైపు ఆసియాలోనే అత్యంత సంపన్నుడై అంబానీ కుమారుడి పెళ్లి నేపథ్యంలో స్థానిక హోటళ్లు ధరలను పెంచేశాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రెండు లగ్జరీ హోటళ్లు ఒక్క రాత్రి స్టేకి ఏకంగా రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ముంబై మీడియా నివేదించింది. ఆ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ట్రైడెంట్, ఒబెరాయ్ హోటళ్ల అధికారిక వెబ్సైట్ ప్రకారం.. జులై 10వ తేదీ నుంచి జులై 14 వరకూ గదులు అందుబాటులో లేవు. ఇక అంబానీ ఫ్యామిలీ మాత్రం అతిథుల కోసం పెళ్లి వేదికకు సమీపంలోని లగ్జరీ హోటల్స్‌ను బుక్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ సహా హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు కూడా ముంబైకి తరలిరానున్నారు.
పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ వివాహం జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.
Also Read..
Mamata Banerjee | అనంత్ అంబానీ పెళ్లికి బెంగాల్ సీఎం.. మహారాష్ట్ర నేతలతో దీదీ భేటీ
Nita Ambani | అంబానీ ఇంట దుర్గామాత పూజ.. ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ.. PHOTOS