(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని ఆ విద్యార్థిని చేసిన ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగిలాయి. తన ఆవేదనను పట్టించుకోవట్లేదని చివరకు ఒంటికి నిప్పంటించుకొన్న ఆ బీఈడీ విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో ఒడిశా బీజేపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో బాధిత విద్యార్థిని సెకండియర్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ చదువుతున్నది. అయితే, తన లైంగిక కోరికలు తీర్చమంటూ హెచ్వోడీ సమీర్ కుమార్ సాహూ గత కొన్నిరోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. దీంతో ఈ నెల 1న అంతర్గత ఫిర్యాదుల కమిటీకి (ఐసీసీ) బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నిందితుడిపై కమిటీ సభ్యులు చర్యలు తీసుకొంటారని ఆమె భావించింది. అయితే, పది రోజులు గడిచినప్పటికీ, ఎలాంటి స్పందన రాకపోవడంతో మిగతా విద్యార్థులతో కలిసి శనివారం కాలేజీ గేటు ముందు నిరసనకు దిగింది. ఈ క్రమంలో హఠాత్తుగా ప్రిన్సిపల్ క్యాబిన్ వద్దకు వెళ్లిన బాధితురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నది. మూడు రోజుల చికిత్స అనంతరం సోమవారం ఆమె మరణించింది. ఈ ఘటనకు సంబంధించి హెచ్వోడీ, ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. తన కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే కారణమని, వాళ్లు పక్షపాత ధోరణితో ప్రవర్తించారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బాధితురాలి స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు వేలాదిమంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందని కాంగ్రెస్ నేత రాహుల్ మండిపడ్డారు.కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినప్పటికీ బాధితురాలికి న్యాయం జరుగలేదని, ఆమె మృతికి సిస్టమ్ ఫెయిల్యూరే కారణమని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. బీజేపీ ఇచ్చిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’ నినాదం క్రమంగా ఒడిశాలో ‘బేటా పడావో.. బేటీ జలావో(కూతురిని తగుల బెట్టండి’)గా మారిందని బీజేడీ మండిపడింది.