భువనేశ్వర్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పీసీసీ, ఆఫీస్ బేరర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా, బ్లాక్, మండల్ కాంగ్రెస్ కమిటీలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, డిపార్ట్మెంట్లు, సెల్స్తో సహా పూర్తిగా రద్దు ప్రతిపాదనను మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించే వరకు ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు తాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరిస్తారని అందులో పేర్కొంది.
కాగా, ప్రస్తుతం రద్దయిన ఒడిశా పీసీసీ అధ్యక్షుడిగా శరత్ పట్నాయక్ ఉన్నారు. లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో ఆ రాష్ట్రంలో పార్టీని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా రద్దు చేశారు.