భువనేశ్వర్: ఇటీవల పలు రాష్ట్రాల్లో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహిళా పోలీస్ అధికారిణిపై ఒక బీజేపీ ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయంటూ బీజేపీ బుధవారం నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబల్పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలుపల నిరసనకు దిగారు. సంబల్పూర్ బీజేపీ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయనారాయణ మిశ్రా కూడా ఇందులో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు విఫల యత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనితా ప్రధాన్‌పై బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా దాడి చేశారు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమె లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అసభ్యకరంగా తిట్టారు. అంతేగాక తన చేతితో ఆ మహిళా పోలీస్ అధికారిణిని నెట్టివేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే మిశ్రాపై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా పోలీస్ అధికారిణిపై చేయి చేసుకున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒడిశా పోలీస్ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ అధికార ప్రతినిధి శ్రీమయీ మిశ్రా దీనిపై స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా నేరస్తుడని ఆరోపించారు. ఆయనపై హత్యతో సహా 14 కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో జైలుకు కూడా వెళ్లారని విమర్శించారు. ప్రజలను బెదిరించడం, దాడి చేయడంలో ఆయన పేరు సంపాదించారంటూ మండిపడ్డారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రాపై పోలీస్ అధికారిణి అనితా ప్రధాన్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తామని సంబల్పూర్ ఎస్పీ గంగాధర్ తెలిపారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను మిశ్రా తోసిపుచ్చారు. మహిళా పోలీస్ అధికారిణి అనితానే తనను తోసిదంటూ ఆమెపై ఎదురు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురి ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Top BJP leaders talk about women's dignity & respect. But, see how Odisha’s LoP Jaynarayan Mishra misbehaved with a woman policeman.
We demand that the BJP leader be arrested first for attempting to slap the lady police before the investigation starts.@INCOdisha @SaratPatINC pic.twitter.com/DBUOaTnTCu
— Kantanu Kundu #BharatJodoYatra (@kantanu) February 16, 2023
Odisha BJP MLA Jaynarayan Mishra 'Misbehaves' With A Female Cop, Says, "Will Slap You" pic.twitter.com/iyiFcNPMyL
— varun sharma (@varunquotes) February 16, 2023