Shambala | టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్ బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. ఆయన కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ‘శంబాల’ (Shambala) హిందీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం తెలుగులో విడుదలై మంచి హిట్ అందుకోవడమే కాకుండా రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. తెలుగు నటులు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఉత్తరాది ప్రేక్షకులను పలకరిస్తున్న తరుణంలో ఆది కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 1980ల నాటి కథ. శంబాల అనే ఊర్లో ఓ ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడిన నాటినుంచి ఆ ఊరిలో అన్నీ అపశకునాలు కనిపిస్తుంటాయి. దాంతో శాస్ర్తాలను, దేవుళ్లనీ, దెయ్యాలనీ అమితంగా నమ్మే ఆ ఊరి జనం ఆ ఉల్కని ‘బండ భూతం’ అని పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఉల్కని స్టడీ చేసుందుకు సైంటిస్ట్ విక్రమ్(ఆది సాయికుమార్) ఆ ఊళ్లోకి అడుగుపెడతాడు. అతను సైన్స్‌ని మాత్రమే నమ్ముతాడు. ఊరిజనాల నమ్మకాలన్నీ మూఢ నమ్మకాలని అతని ఉద్దేశ్యం. ఆ ఉల్క పడిన నాటి నుంచి ఆ ఊరివాడైన రాములు(రవివర్మ) చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఓ ఆవుకు పాలు పిండబోతే, పాలకు బదలు రక్తం కారుతుంటుంది. ఆ ఆవుని చంపితే కానీ ఈ ఊరికి పట్టిన అరిష్టం పోదని ఊరి జనాలు నిర్ణయించుకొని ఆ ఆవును చంపబోతుంటే విక్రమ్ అడ్డుకొని ఆ ఆవుని తనతోపాటు తీసుకెళ్తాడు. ఇక రాములు రోజురోజుకీ రాక్షసుడిలా మారుతుంటాడు. అడ్డొచ్చినవాళ్లందర్నీ చంపుకుంటూ పోతుంటాడు. ఓ దశలో విక్రమ్ మీదకు కూడా ఎగబడతాడు. తాడికి తెగబడతాడు. అసలు ఆ ఊళ్లో ఏం జరుగుతుంది? ఆ ఉల్క వెనుక ఉన్న కథేంటి? ఆ ఊళ్లో అలాంటి భయానకమైన సంఘటనలు జరగడానికి కారణమెవరు? సైన్స్‌ని మాత్రమే నమ్మే విక్రమ్ దేవుడ్ని మొక్కాడా? లేదా? ఈ ప్రశ్నలన్నిమటికీ సమాధానమే మిగతా కథ.