Calcium For Kids | ఎదిగే పిల్లలకు అవసరమయ్యే పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. ఎముకలు, దంతాలు, పిల్లల అభివృద్దికి క్యాల్షియం చాలా అవసరం. మన శరీరంలో క్యాల్షియం ఎక్కువ భాగం ఎముకల్లోనే నిల్వ చేయబడి ఉంటుంది. మన శరీరంలో దాదాపు 99 శాతం క్యాల్షియం ఎముకల్లోనే ఉంటుంది. పిల్లలకు క్యాల్షియం చాలా అవసరం. క్యాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీన పడడంతో పాటు ఎముకల్లో పగుళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. శరీరంలో తగినంత క్యాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు క్షీణిస్తాయి. అంతేకాకుండా శరీరం ఎముకల నుండి క్యాల్షియాన్ని తీసేసి ఇతర చోట్ల వినియోగిస్తుంది. మన శరీరం ఉండే ఎముకలు చిన్నతనంలోనే క్యాల్షియాన్ని కూడబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఎముకలు క్యాల్షియాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. చిన్నతనంలో ఎముకల సాంద్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కనుక పిల్లలకు క్యాల్షియం ఉండే ఆహారాలను ఇవ్వడం చాలా అవసరం. పిల్లల క్యాల్షియం అవసరాలను తీర్చే ఆహారాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
నల్లనువ్వులు క్యాల్షియం అద్భుతమైన మూలం అని చెప్పవచ్చు. విటమిన్ బి కాంప్లెక్స్, ప్రోటీన్, మంచి కొవ్వులు వీటిలో అధికంగా ఉంటాయి. నువ్వులతో నువ్వుల చిక్కీ చేసి పిల్లలకు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారికి తగినంత క్యాల్షియం అందుతుంది. పెరుగు సులభంగా కరిగే క్యాల్షియాన్ని కలిగి ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కనుక పిల్లలకు పెరుగును రోజూ ఆహారంలో భాగంగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. రాజ్మా, కాబూలీ చనా, బ్లాక్ చనా, గ్రీన్ చనా వంటి పప్పు దినుసుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక పప్పును పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల క్యాల్షియం లోపం లేకుండా ఉంటుంది.
ఆకుకూరల్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మెంతి, పాలకూర, ముల్లంగి ఆకులు, పుదీనా, కొత్తిమీర వంటి వాటిల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకుకూరలను పిల్లలకు రోజువారీ ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎముకలు దృఢంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వాల్ నట్స్, అంజీర్, ఖర్జూరం, ఆప్రికాట్ వంటి వాటిల్లో కూడా క్యాల్షియం ఎక్కవగా ఉంటుంది. అలాగే వీటిలో ప్రోటీన్, కొవ్వులు, విటమిన్లు వంటి పోషకాలు కూడా ఉంటాయి. వీటిని రోజూ పిల్లలకు ఇవ్వడం వల్ల క్యాల్షియం లోపంతో పాటు పోషకాహార లోపం కూడా లేకుండా ఉంటుంది. ఈ విధంగా పిల్లలకు రోజూ క్యాల్షియం ఉండే ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఎముకలు బలంగా తయారవ్వుతాయి. బాల్యంలో ఉండే బలమైన ఎముకలే జీవితాంతం మన ఎముకల ఆరోగ్యానికి మూలం. కనుక పిల్లల ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను వారికి ఇవ్వడం చాలా అవసరమని పోషకాహార వైద్యులు చెబుతున్నారు.