న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ర్టాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ శుక్రవారం పలువురిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది. వీరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ఉన్నారు. వీరు మిగిలిన పరిశీలకులతో కలిసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండు, మూడు రోజుల్లో వీరి పేర్లు వెల్లడి కావచ్చునని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆయా రాష్ర్టాల ఎమ్మెల్యేలు, సీఎం పదవికి పోటీపడుతున్న అభ్యర్థులతో వారాంతంలో సమావేశమై అభిప్రాయాలను సేకరిస్తారు. రాజస్థాన్‌లో రాజ్‌నాథ్ సింగ్ పార్టీ ఉపాధ్యక్షుడు సరోజ్ పాండే, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలతో కలిసి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అలాగే ఖట్టర్ మధ్యప్రదేశ్‌లో, అర్జున్ ముండా ఛత్తీస్‌గఢ్‌లలో ఇతర కేంద్ర పరిశీలకులతో కలిసి నేతను ఎంపిక చేసి అధిష్ఠానానికి సిఫార్సు చేస్తారు.