చెన్నై, జూలై 31 : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా, నటుడు, తమిళగ వెట్రి ఖగజం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్‌తో పొత్తు కుదుర్చుకునే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చ లేదు. ఎన్నికలకు ఇంకా సమయమున్నందున కాలమే దానికి సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను గురువారం మార్నింగ్ వాక్ సందర్భంగా కలిసిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.
ఓపీఎస్ కూటమి నుంచి బయటకు వచ్చిన విషయాన్ని ఆయన విశ్వాసపాత్రుడు పన్రుతి ఎస్ రామచంద్రన్ కూడా నిర్ధారించారు. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని పన్నీరుసెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడతారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి తమకు ఏ పార్టీతో పొత్తు లేదని అన్నారు. ఎన్నికలకు ముందు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. అన్నాడీఎంకే పార్టీకి తామే అసలైన ప్రతినిధులమని పేర్కొనే ఆయన ఆ పార్టీ బహిష్కృత నేతగా కొనసాగుతున్నారు.