న్యూఢిల్లీ: గ్రేస్ మార్కులు తొలగించిన 1,563 విద్యార్థులకు ఆదివారం నీట్-యూజీ పరీక్షను ఎన్టీఏ మరోసారి నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 1,563 మందికిగానూ 813 మంది, అంటే 52 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు ఎన్టీఏ సీనియర్ అధికారి వెల్లడించారు. మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షలో సమయాన్ని కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు మొదట ఎన్టీఏ గ్రేస్ మార్కులను కలిపిన సంగతి తెలిసిందే. ఇది వివాదాస్పదం కావడంతో గ్రేస్ మార్కులు తొలగించి, వీరికి మళ్లీ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరైన వారికి ఇందులో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని, హాజరుకాని వారికి గత పరీక్ష మార్కులను(గ్రేస్ మార్కులు మినహాయించిన తర్వాత) పరిగణిస్తామని గతంలోనే ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది.
నీట్ పరీక్ష అక్రమాల ఆరోపణలపై ఎన్టీఏ ఇప్పటికే 63 మంది విద్యార్థులను డిబార్ చేయగా..ఆదివారం బీహార్‌కు చెందిన మరో 17 మందిని, గుజరాత్‌లోని గోద్రాలో పరీక్ష రాసిన మరో 30 మందిని డిబార్ చేసింది.
ఛండీగఢ్‌లోని ఓ నీట్ యూజీ పరీక్షా కేంద్రం వెలవెలబోయింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఛండీగఢ్‌లో సెక్టార్-44లోని సెయింట్ జోసెఫ్ సీనియర్ సెకండరీ స్కూల్ కేంద్రం కూడా ఒకటి. ఈ కేంద్రంలో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంది. ఇందుకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. సిబ్బంది, పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే, పరీక్ష రాయాల్సి ఉన్న ఇద్దరు విద్యార్థులూ పరీక్షకు హాజరుకాలేదు. దీంతో నిబంధనల ప్రకారం 1:30 వరకు చూసి గేట్లు మూసివేశారు. దీంతో పరీక్షా కేంద్రంలో పరీక్ష జరగలేదు.