Pran Prathistha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటలకు సుముహర్తం దివ్యంగా కుదిరిందని శ్రీ రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేందర్ మిశ్రా బుధవారం వెల్లడించారు. సింహాసనం అధిష్టించే రామ్ లల్లా విగ్రహాన్ని గురువారం ఉదయం రామాలయ గర్భగుడిలోకి తీసుకువస్తారని మిశ్రా తెలిపారు. ఈ క్రతువుకు సంబంధించి పూజలు, ప్రార్ధనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు.
రేపు రామ్ లల్లాకు అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారని చివరిగా ఈనెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాన కార్యక్రమం జరుగుతుందని మిశ్రా వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని చెప్పారు. మంగళవారం ప్రారంభమైన పూజాదికాలు వారం పొడవునా సాగుతాయని అన్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని వేలాది మంది వీఐపీ అతిధులకు రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందచేసింది.
ప్రపంచవ్యాప్తంగా హిందవులు తమ విశ్వాసానికి గౌరవం దక్కిందని ఈ అపురూప ఘట్టం కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారని నృపేందర్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చే అతిధులు, భక్తుల కోసం ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశీ నెయ్యితో తయారుచేసిన మోతీచూర్ లడ్డూలను ప్రసాదంగా అతిధులందరికీ ట్రస్ట్ అందచేస్తుంది. ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ సారధ్యంలోని పూజారుల బృందం ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Read More :
Clothes for Lord Ram | అయోధ్య రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలివే.. Video