Wheelchair | నడవలేని స్థితిలో ఉన్న వారికి, వృద్ధులకు రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ (Wheelchair) సదుపాయం ఉచితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, ఓ ఎన్నారైకు వీల్‌చైర్ సేవలు అందించినందుకు గానూ ఓ పోర్టర్ రూ.10 వేలు వసూలు చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన డిసెంబర్ 28వ తేదీన చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై నార్తర్న్ రైల్వే తీవ్రంగా స్పందించింది. సదరు పోర్టర్ లైసెన్స్‌ను రద్దు (porters licence cancelled) చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా ఎన్నారై ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన డబ్బుల్లో 90 శాతం వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది.
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో (Hazrat Nizamuddin railway station) వీల్‌చైర్ సేవలు అందించినందుకు గానూ ఎన్నారై నుంచి పోర్టర్ రూ.10 వేలు వసూలు చేశాడు (NRI charged Rs 10,000). అయితే, రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ సేవలు ఉచితం అని తెలుసుకున్న ఎన్నారై కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన రైల్వే అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు పోర్టర్‌ను గుర్తించారు. అతడు వసూలు చేసిన సొమ్ములో 90 శాతం అంటే.. రూ.9వేలు వెనక్కి తీసుకుని ఎన్నారై ప్రయాణికుడికి అందించారు.
ఈ మేరకు పోర్టర్ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు సహించబోమని నార్తర్న్ రైల్వేస్ స్పష్టం చేసింది. పోర్టర్ నుంచి బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్ఠను దిగజారుస్తాయని, ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ముచేస్తాయని పేర్కొంది. ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే 139 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించింది.
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
PM Modi | మోదీని కలిసిన గాయకుడు దిల్జిత్.. 2025 ఏడాది గొప్పగా ప్రారంభమైందంటూ పోస్ట్
Jharkhand | భార్యతో గొడవ.. బావిలో పడ్డ భర్త.. కాపాడబోయి మరో నలుగురు మృతి