Aadhaar | గువాహటి: అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) దరఖాస్తు రసీదు నెంబర్ (ఏఆర్ఎన్)ను సమర్పించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. దీనికి సంబంధించిన సవివరమైన ప్రామాణిక కార్యనిర్వహణ విధానాన్ని రూపొందిస్తామని, ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. దీనివల్ల విదేశీయులు అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించడం ఆగుతుందని తెలిపారు. ఆధార్ కార్డు ల కోసం వచ్చిన దరఖాస్తులు బార్పేట, ధుబ్రి, మోరిగావ్, నాగావూన్ జిల్లాల్లో జనాభాకు మించి ఉన్నాయన్నారు. దీంతో అనుమానాస్పద పౌరులు ఉన్నట్లు అర్థమవుతున్నదని చెప్పారు. ఇతర రాష్ర్టాలు కూడా ఆధార్ జారీలో కఠినంగా వ్యవహరిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న పూజా ఖేద్కర్‌ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగిం చింది. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆమె ఎంపికను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ నెల క్రితం రద్దు చేసింది. ఓబీసీ, దివ్యాంగుల కోటాలను పూజ అక్రమంగా ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. పూజ రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో అర్హత లేకున్నా గొంతెమ్మ సదుపాయాలను కోరారు. దీంతో పూణె కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపించారు. పర్యవసానంగా ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు.