Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటీసిచ్చింది. అధికారిక బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులో ఆదేశించారు. ఈ నోటీసును కశ్మీర్ ఎస్టేట్స్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తి ఉన్న సమయంలో ఈ బంగ్లాను ప్రభుత్వం కేటాయించింది. అయితే, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఆమె అధికారిక బంగ్లాను వీడలేదు. దాంతో ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. అధికారిక బంగ్లాను ముఫ్తీ ఖాళీ చేయలేదన్న విషయం నాలుగేండ్ల తర్వాత అధికారులకు బోధపడటం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గుప్కర్ రోడ్డులోని ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బంగ్లాలోకి మారారు. 2016 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి విజయం సాధించి జమ్ముకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ నియమితులయ్యారు. 2018 జూన్ 19 వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉంటున్నారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి బదులుగా మరో ఇంటిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆ నోటీసులో ముఫ్తీకి తెలిపారు.
అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని రాష్ట్ర అధికార యంత్రాంగం నోటీసు ఇవ్వడంపై మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. ‘నేను ఉండేందుకు నాకు ఒక ఇళ్లంటూ లేదు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? ఎక్కడికిపోవాలి? నేను ఒక నిర్ణయం తీసుకుకునే ముందు న్యాయ బృందంతో సంప్రదిస్తాను’ అని ముఫ్తీ చెప్పారు. తనకు నోటీసు ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. తన తండ్రి సీఎం పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ బంగ్లా ఇచ్చారని ఆమె వాదిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఇంటి నుంచి ప్రభుత్వాన్ని నడిపానని, అంతమాత్రానా ఇది సీఎం అధికారిక నివాసం ఎలా అవుతుందని ప్రశ్నించారు.