CJI Chandrachud | న్యూఢిల్లీ: గణపతి పూజ సందర్భంగా ప్రధాని మోదీ తన ఇంటికి రావటంలో తప్పేమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రధాని మోదీని తన ఇంటికి ఆహ్వానించటంపై విమర్శలు చేస్తున్నవాళ్లను ఉద్దేశించి సీజేఐ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రెండు వ్యవస్థల బలోపేతం కోసం జరిగే చర్చల్ని గౌరవించాలని, అధికార విభజన ఉన్నంత మాత్రాన కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు చెందిన ఇద్దరు కలుసుకోకూడదని ఏమీ లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి అంశాల్లో రాజకీయ పరిణతి చూపాల్సిన అవసరముందన్నారు. ‘గణపతి పూజ కోసం మా ఇంటికి ప్రధాని వచ్చారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య తరుచూ సమావేశాలు జరుగుతుంటాయి. గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి భవన్లో కలుసుకుంటాం. ఇదీ అలాంటిదే. మం త్రులు, ప్రధానితో జరిగే సమావేశాల్లో కేసుల ప్రస్తావన రాదు’ అని అన్నారు.