NOTA | ఇండోర్: ఈవీఎంలలోని నోటా బటన్ కేవలం లాంఛనప్రాయమైనదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ చెప్పారు. ఇండోర్ లోక్సభ స్థానంలో నోటాకు ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రావత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఏదైనా స్థానంలో నోటాకు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చినపుడు మాత్రమే, ఎన్నికల ఫలితాల్లో దానికి చట్టబద్ధమైన ప్రభావం ఉండేలా చేయడంపై ఆలోచించవచ్చునని తెలిపారు.
100 ఓట్లలో 99 ఓట్లు నోటాకు, కేవలం ఒక ఓటు మాత్రమే అభ్యర్థికి పడినపుడు సైతం ఆ అభ్యర్థే విజేత అవుతారన్నారు. నేర చరిత్ర కలవారిని, ఇతర అనర్హులను తాము ఓటు వేయడానికి పరిగణనలోకి తీసుకోబోమని రాజకీయ పార్టీలకు చెప్పడానికి ఏదైనా స్థానంలో 50 శాతానికి పైగా ఓట్లు వేయాలన్నారు. దీనివల్ల పార్లమెంటు, ఎన్నికల కమిషన్లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. అప్పుడు మాత్రమే ఎన్నికల ఫలితాలపై నోటా ప్రభావం ఉండే విధంగా చట్టాలను సవరించడం గురించి అవి ఆలోచించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పారు.