నోయిడా: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం(Noida Airport) అధికారికంగా ప్రారంభమైంది. లక్నో నుంచి ప్రయాణికులతో తొలి ఇండిగో విమానం చేరుకున్నది. ఆ తర్వాత లక్నోకు ఫ్లయిట్ టేకాఫ్ తీసుకున్నది. జీవార్ ప్రాంతానికి చెందిన మహిళలు ఆ విమానంలో ప్రయాణం చేశారు. ఎయిర్‌పోర్టు తొలి దశ అభివృధ్ధి పనుల కోసం జీవార్ ప్రాంత రైతుల భూముల్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలు విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 7.12 నిమిషాలకు విమానం టేకాఫ్ తీసుకున్నది. ఆ తర్వాత 7.58 నిమిషాలకు ఆ విమానం నోయిడాలో ల్యాండ్ అయినట్లు అధికారులు చెప్పారు.యూపీ, ఎన్సీఆర్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు నోయిడా విమానాశ్రయాన్ని స్టార్ట్ చేశారు. ఇక నోయిడా విమానాశ్రయం నుంచి 8.19 నిమిషాలకు విమానం టేకాఫ్ తీసుకున్నది. జీవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్‌తో పాటు ఇతర అధికారులు ఆ విమానంలో ప్రయాణించారు. వ్యాపారులకు, విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు కొత్త విమానాశ్రయం లబ్ధి చేకూరుస్తుందని అధికారులు చెప్పారు. చండీఘడ్, అమృత్సర్, జమ్మూ, ధర్మశాలకు చెందిన ప్రయాణికులు.. నోయిడా విమానాశ్రయాన్ని వాడుకునే వీలు ఉంది.