బెంగళూరు, జూలై 17 : ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులకు కేరాఫ్‌గా ఉన్న బెంగళూరు నగరం క్రమక్రమంగా మళ్లీ నగదు లావాదేవీలకు మళ్లుతున్నది. నగరవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థానంలో ‘యూపీఐ వద్దు.. నగదు మాత్రమే’ అని చేతి రాతతో ఉన్న బోర్డులను పెడుతున్నారు. పన్ను నోటీసులు, అధికారుల డేగ కన్నే ఈ మార్పునకు కారణంగా కనపడుతున్నది. సౌకర్యవంతంగా ఉండేందుకు నిన్నటివరకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)కి ప్రాధాన్యత ఇచ్చిన పలువురు చిరు వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు తమను జీఎస్టీ శాఖ నిఘా నేత్రాల దృష్టికి తీసుకువెళ్లాయని చెబుతున్నారు. ‘రోజూ సుమారు రూ. 3,000 వరకు వ్యాపారం చేస్తాను. వచ్చే కొద్దిపాటి లాభంతో జీవనం సాగిస్తున్నాను. ఇక యూపీఐ చెల్లింపులను ఎంత మాత్రం ఆమోదించే పరిస్థితి లేదు’ అని హొరమావులో చిన్న దుకాణం నడుపుకునే శంకర్ తెలిపారు.
రోడ్డు పక్క ఫుడ్ స్టాళ్లు, తోపుడు బండ్లు, ఫుట్‌పాత్ దుకాణాలతోసహా బెంగళూరులో అనధికారికంగా వ్యాపారాలు చేసుకునే వేలాదిమందికి జీఎస్టీ నోటీసులు వచ్చాయని న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారులు తెలిపారు. వీటిలో కొన్ని లక్షల రూపాయల్లో పన్ను నోటీసులు ఉన్నాయని వారు చెప్పారు. జీఎస్టీ అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతాయని చాలామంది చిరు వ్యాపారులు భయపడుతున్నారని బెంగళూరు వీధి వ్యాపారుల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి, న్యాయవాది వినయ్ కే శ్రీనివాస తెలిపారు. జీఎస్టీ నోటీసులకు స్పందించకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమను తొలగించే అవకాశం కూడా ఉందని చాలామంది ఆందోళన చెందుతున్నారని, ఈ కారణంగానే యూపీఐ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేశారని ఆయన చెప్పారు. ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం తమ వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షలు దాటిన సరకుల సరఫరా వ్యాపారం చేసేవారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ. 20 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన సర్వీస్ ప్రొవైడర్లు జీఎస్టీ పరిధిలోకి వస్తారు.
2021-22 నుంచి యూపీఐ చెల్లింపుల ద్వారా వార్షిక టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించిన వ్యాపారులకు మాత్రమే పన్ను నోటీసులు అందచేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. అటువంటి వ్యాపారులు తమ వ్యాపారాలను రిజిస్టర్ చేసుకుని వార్షిక టర్నోవర్‌ను వెల్లడించి అవసరమైన పన్ను చెల్లించాలని అధికారులు తెలిపారు.
యూపీఐ పన్నుల నుంచి తిరిగి నగదు లావాదేవీలకు చిరు వ్యాపారులు మరలిపోవడం బెంగళూరుకే పరిమితం కాబోదని, ఇతర నగరాలకు కూడా ఇది విస్తరించే అవకాశం ఉందని శ్రీనీ అండ్ అసోసియేట్స్‌కి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీనివాసన్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రిజిస్టర్ కాని వ్యాపారాల నుంచి ఎస్టీ అధికారులకు పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం లభించిన పక్షంలో నిధుల కోసం అల్లాడుతున్న ఇతర రాష్ర్టాలు సైతం ఇవే చర్యలను చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ముంబై నగరంలో భారీ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహించే చాట్ దుకాణదారులపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారని, వారు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తే భారీ ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన తెలిపారు.