Supreme Court | రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం (Clear Bills) తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్ల (Governors)కు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని వెల్లడించింది.
చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం రాష్ట్రపతి నివేదనపై సెప్టెంబర్ 11 నుంచి 10 రోజులపాటు విచారణ జరిపి తన అభిప్రాయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడమంటే రాజ్యాంగ అధికారాలను ధిక్కరించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని తెలిపింది. గవర్నర్లు బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని వివరించింది. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లేని పక్షంలో ఎందుకు జాప్యం జరిగిందో కారణాన్ని రాష్ర్టానికి తెలియచేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) స్పందిస్తూ.. రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టొచ్చా..? అని ప్రశ్నించారు.
రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందన్నారు. ‘రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు..? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు.. కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?’ వంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద పలు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగారు.