న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఓ వైపు రూ.2.5 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉంటే పన్ను కట్టాలని కేంద్ర సర్కారు చెప్తుంది. మరోవైపు ఆర్థిక బలహీన వర్గాలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని విధించింది. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది సబబేనా? అని అడిగితే రెండు వేర్వేరు లెక్కలని కేంద్రం చెబుతున్నది.
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి ఈ అంశంపై రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఆదాయ పన్ను, ఈడబ్ల్యూఎస్ ఆదాయపరిమితి.. రెండింటిని లెక్కించే విధానం వేరువేరుగా ఉంటుందని, రెండింటి మధ్యన ఎలాంటి పొంతన లేదని అన్నారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని వ్యక్తిగతంగా, ఈడబ్ల్యూఎస్ ఆదాయాన్ని కుటుంబపరంగా లెక్కిస్తారని చెప్పారు.
23నే సమావేశాల ముగింపు!
షెడ్యూలు కంటే వారం ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాలి. అయితే, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 23నే సమావేశాలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.