న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. మతం మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తింపజేయాలన్న పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం స్పందిస్తూ.. భారత రాజ్యాంగంలోని (షెడ్యూల్డ్ క్యాస్ట్) ఆదేశాలు-1950 ప్రకారం క్రిస్టియన్లు, ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వలేదని, ఆ రెండు మతాలు అణచివేతకు గురవలేదని తెలిపింది. ఈ రెండు మతాల్లో అంటరానితనం అంతగా లేదని వివరించింది. అంటరానితనం వల్ల ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకే ఈ హోదా ఇచ్చామని, అలాంటి పరిస్థితి క్రైస్తవ, ఇస్లాం సామాజిక వర్గాల్లో లేదని స్పష్టం చేసింది. మతం మారినా ఎస్సీ హోదా వర్తింపజేయాలన్న జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను కూడా కేంద్రం తోసిపుచ్చింది. ఆ సమస్యను పరిశీలించేందుకు మరో కమిషన్ వేశామని, ఆ కమిషన్ రెండేండ్లలో నివేదిక అందజేస్తుందని పేర్కొన్నది.