Chandrayaan-3 | న్యూఢిల్లీ, జూలై 17: ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్‌యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉన్న మోదీ సర్కార్.. వాటిని ఉద్దేశపూర్వకంగా దగా చేస్తున్నది. ఇందులో భాగంగా చంద్రయాన్-3 ప్రాజెక్టులో కీలకమైన లాంచ్‌ప్యాడ్ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్(హెచ్ఈసీ) ఇంజినీర్లకు దాదాపు ఏడాదికి పైగా వేతనాలు అందట్లేదన్న విషయం బయటకు వచ్చింది. ఝార్ఖండ్‌లోని రాంచీ కేంద్రంగా ఈ సంస్థ నడుస్తున్నది. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వర్కింగ్ క్యాపిటల్ అందించాలని అభ్యర్థించినా.. పట్టించుకొన్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి సాయం చేసేది లేదని తెగేసి చెప్పింది. దీంతో హెచ్ఈసీ ఇబ్బందుల్లో నడుస్తున్నది.
షెడ్యూల్‌కు ముందే అందజేత
హెచ్ఈసీకి చెందిన ఇంజినీర్లకు గత 17 నెలలుగా జీతాలు రావడం లేదని వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేధించింది. వేతనాలు చెల్లించనప్పటికీ.. షెడ్యూల్ కంటే ముందుగానే 2022, డిసెంబర్లో మొబైల్ లాంచ్ ప్యాడ్, ఇతర పరికరాలను సంస్థ అందించిందని పేర్కొన్నది. 2,700 వర్క్‌మెన్, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు 14 నెలలుగా జీతాలు అందలేదని ‘ఫ్రంట్‌లైన్’ మేలో పేర్కొన్నది. ఐఏఎన్ఎస్ 2022, నవంబర్‌లో ఓ కథనం ఇచ్చింది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగం కావడం పట్ల ఆనందంగా ఉన్నదని సుభాష్ చంద్ర అనే ఇంజినీర్ తెలిపారు.
ఎలాంటి సాయం చేయం!
మరోవైపు హెచ్ఈసీ సంస్థను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇస్రోతో పాటు రక్షణ శాఖ, రైల్వే, కోల్ ఇండియా, స్టీల్ రంగం నుంచి రూ.1,500 కోట్ల విలువైన అర్డర్లు ఉన్నప్పటికీ, నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు నిలిచిపోయాయని ఐఏఎన్ఎస్ వెల్లడించింది. రూ.1,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అందించాలని సంస్థ పలుమార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను అభ్యర్థించిందని, అయితే ఎటువంటి సాయం చేసేది లేదని సమాధానం ఇచ్చిందని ఐఏఎన్ఎస్ పేర్కొన్నది. గత రెండున్నర ఏండ్లుగా హెచ్ఈసీకి శాశ్వత ప్రాతిపదికన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) నియామకం చేపట్టలేదు.
రెండోసారి చంద్రయాన్ -3 కక్ష్య పెంపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14న ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం చంద్రునివైపు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇస్రో సోమవారం రెండోసారి మిషన్ కక్ష్యను పెంచింది. భారత్ పంపిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ ప్రస్తుతం భూమికి 41,603 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రయాణిస్తున్నట్టు ఇస్రో వెల్లడించింది. భూమి గురుత్వాకర్షణను తప్పించుకొని, చంద్రునివైపు మిషన్ ప్రయాణించాలంటే ఇంకా మూడుసార్లు కక్ష్యను పెంచాల్సి ఉంటుంది. చంద్రయాన్-3ని ప్రయోగించిన మరుసటిరోజు ఇస్రో మొదటిసారి కక్ష్యను పెంచింది. ఈనెల 14న చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.