Supreme Court | న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఏడాదంతా వాయుకాలుష్యం తాండవం చేస్తున్నప్పుడు ఫలానా నెలల్లో మాత్రమే టపాసులు కాల్చడంపై ఆంక్షలు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాణసంచాపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు విధించడం లేదని నిలదీసింది. కాలుష్యాన్ని సృష్టించే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని పేర్కొంది. టపాసులు ఇలాగే కాల్చుకుంటే పోతే అది పౌరుల ఆరోగ్య హక్కును హరించడమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీరుపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
బాణసంచా తయారీ, అమ్మకం, కాల్చడంపై అక్టోబర్-జనవరి మధ్య మాత్రమే ఆంక్షలు ఎందుకని, ఏడాదంతా ఎందుకు విధించడం లేదని ప్రశ్నించింది. పండుగుల సీజన్, ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తీవ్రతరం చేసే నెలలపైనే దృష్టిసారించినట్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి కోర్టుకు తెలిపారు. భాటి వివరణపై సంతృప్తి చెందని ధర్మాసనం శాశ్వత నిషేధం విధించేలా చూడాలని సూచించింది. బాణసంచా తయారీ, అమ్మకాన్ని నిషేధిస్తూ అక్టోబర్ 14న ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఎన్నికలు, వివాహాల సమయంలో బాణసంచా కాల్చడాన్ని మినహాయించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు పరిశీలించింది.