Siddaramaiah | కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం, మంత్రివర్గ మార్పు ఉండవచ్చంటూ మీడియాలో వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న 50 శాతం మంది మంత్రులను తొలగించి, కొత్తవారికి అవకాశం ఇస్తారన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేదని వ్యాఖ్యానించారు.
ఇటీవలే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ.. సీఎం మార్పుకు హైకమాండ్ (Congress high command) అభిప్రాయం సరిపోతుందని శాసనసభ్యుల అభిప్రాయం కాదని చెప్పిన విషయం తెలిసిందే. డీకే వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ‘వీటికి నేను సమాధానం చెప్పను. హైకమాండ్ అంటే హైకమాండ్. హైకమాండ్తోపాటూ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ముఖ్యమే. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరు. దాంతోపాటూ హైకమాండ్ ఆశీస్సులు కూడా అవసరమే’ అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు క్యాబినెట్ సహచరులకు సీఎం ఇటీవలే విందు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘విందు పార్టీకి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో సంబంధం లేదు. నేను తరచుగా విందులు నిర్వహిస్తుంటాను’ అని అన్నారు. ఇది ఒక సాధారణ సమావేశం అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చంటూ వచ్చిన పత్రికా కథనాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే. తనకు ఎటువంటి తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని మీడియా చానెళ్లు వాస్తవాలను వక్రీకరించి సంచలనాత్మక కథనాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేందుకు తనకు సమయం దగ్గరపడుతోంది అని తాను ప్రకటించినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
Gold prices | బంగారం హై జంప్.. ఒక్కరోజే రూ.3 వేలు పెరిగిన తులం ధర
Pumpkin | కూష్మాండం @ 1,064 కిలోలు.. విజేతగా నిలిచిన ఇంజినీర్
Sresan Pharmaceuticals: ఆ దగ్గుమందు కంపెనీ లైసెన్సు రద్దు