చెన్నై : శ్రీసన్ ఫార్మసీ(Sresan Pharmaceuticals) కంపెనీ లైసెన్సును తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ శాఖ రద్దు చేసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీ చేస్తున్న ఆ కంపెనీ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు డ్రగ్స్ శాఖ వెల్లడించింది. కోల్డ్రిఫ్ దగ్గుమందులో ప్రాణాంతకమైన డైఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 21 మంది చిన్నారుల మృతికి కారణమైన ఆ ప్రాణాంతక ఔషధం ఆ దగ్గుమందులో ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు సర్కారు 2011లో శ్రీసన్ ఫార్మసీ కంపెనీకి దగ్గుమందు తయారీకి లైసెన్సు జారీ చేసింది. 2016లో ఆ లైసెన్సుకు రెన్యూవల్ చేశారు. శ్రీసన్ కంపెనీ లైసెన్సు రద్దు చేసి, దాన్ని పూర్తిగా మూసివేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర డ్రగ్ తయారీ కంపెనీలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు శ్రీసన్ ఫార్మసిట్యుకల్స్తో పాటు కొందరు డ్రగ్ అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. మధ్యప్రదేశ్ డ్రగ్స్ కంట్రోల్ శాఖ అక్టోబర్ ఒకటో తేదీన తమిళనాడు అధికారులకు ఆ దగ్గుమందుపై అలర్ట్ జారీ చేసింది. కోల్డ్రిఫ్తో పాటు అయిదు రకాల ఉత్పత్తులను చెన్నై ల్యాబ్‌లో పరిశీలించారు. దగ్గు సిరప్‌లో ప్రాణాంతకమైన డీఈజీ ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్ 9వ తేదీన మధ్యప్రదేశ్ పోలీసులు కంపెనీ ఓనర్ రంగనాథన్‌ను అరెస్టు చేశారు. 2023లో సరైన రీతిలో తనిఖీలు నిర్వహించని ఇద్దరు తమిళనాడు డ్రగ్ ఇన్స్పెక్టర్లను కూడా సస్పెండ్ చేశారు.