Covid-19 : దేశంలో కొవిడ్ కేసులు (Covid cases) మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హర్యానా రాష్ట్రం (Haryana state) లో కూడా కొవిడ్ కాలు మోపింది. ప్రస్తుతం అక్కడ నాలుగు యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. ఆ నలుగురు కొవిడ్ పేషెంట్ల (Covid patients) లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండు కేసులు గురుగ్రామ్‌లో నమోదు కాగా, మరో రెండు కేసులు ఫరీదాబాద్‌లో నమోదయ్యాయి.
అయితే తమ రాష్ట్రంలో కరోనా కలకలంపై హర్యానా ఆర్థిక మంత్రి ఆర్తి సింగ్ స్పందించారు. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదయ్యాయని, వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మహమ్మారి మరింత విస్తరిస్తే కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నలుగురు కొవిడ్ పేషెంట్లు హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
ఇంతకుముందు గురుగ్రామ్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిందని, ఇప్పుడు అతడు ఆ వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్నాడని మంత్రి తెలిపారు.