ముంబై, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగుల పెన్షన్లకు నిధులు లేవా? అయితే లాడ్లీ బహెన్ వంటి పథకాన్ని ఆపేయండి.. అని మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్కు బాంబే హైకోర్టు స్పష్టంచేసిది. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖకు ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలియవా? అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ విద్యాశాఖకు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పదేపదే ఆఫీసుల చుట్టూ తిరిగినా, తనకు రావాల్సిన బకాయిలను చెల్లించటం లేదని, మరోవైపు ఉచిత పథకాల కోసం నిధుల్ని వాడుతున్న విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని సర్కార్, లాడ్లీ బహెన్ పథకాన్ని ప్రకటించింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల నిధులను ఈ పథకాలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని.. హైకోర్టు ‘ఉద్యోగుల పెన్షన్ల కోసం డబ్బు లేకపోతే, లాడ్లీ బహెన్ వంటి పథకాలను ఆపండి, ఖరీదైన ప్రభుత్వ కార్లను అమ్మండి’ అని గట్టిగా హెచ్చరించింది.