న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాల అప్డేట్కు, అదనంగా నామినీలను చేర్చడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఎక్స్‌లో వెల్లడించారు. అప్డేషన్, నామినీల చేర్పునకు ఆర్థిక సంస్థలు కొంత ఫీజు వసూలు చేస్తాయని ఇటీవల ప్రకటించామన్నారు. అయితే అలాంటి చార్జీలను రద్దు చేస్తూ బుధవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు ఆమె వివరించారు.
అలాగే ఇటీవల ఆమోదించిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం డిపాజిట్‌దారుల డబ్బు, సేఫ్ కస్టడీ, సేఫ్ లాకర్ల్లో ఉంచిన వస్తువులకు నామినీలుగా నలుగురు వరకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ సవరణ బిల్లు ప్రకారం ఒక వ్యక్తికి చెందిన ‘సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్’ అన్న పదాన్ని పునర్నిర్వచించినట్టు చెప్పారు. దీని ప్రకారం ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన 5 లక్షల పరిమితిని రూ.2 కోట్లకు పెంచినట్టు తెలిపారు.