కోల్‌కతా : కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాల ట్రాఫిక్ నత్త నడకతో పోటీ పడుతున్నదని టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 14వ ఎడిషన్ వెల్లడించింది. 2024లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న టాప్-5 ప్రపంచ నగరాల్లో ఈ మూడింటికి స్థానం లభించిందని చెప్పింది. ఫ్లోటింగ్ కార్ డాటా ఆధారంగా 62 దేశాల్లోని 500 నగరాలకు ఈ సూచీలో ర్యాంకులు ఇచ్చారు. ఇందులో కోల్‌కతా, బెంగళూరు, పుణె వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. కోల్‌కతాలో కేవలం 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 34.33 నిమిషాల సమయం పడుతున్నట్టు తేలింది. ఇక బెంగళూరులో 10 కి.మీ ప్రయాణానికి సగటున 34.10 నిమిషాలు, పుణెలో 10 కి.మీ. ప్రయాణానికి సగటున 33.22 నిమిషాలు పడుతున్నది.