న్యూఢిల్లీ, జూలై 10: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో సామూహిక మాల్‌ప్రాక్టీస్ జరగలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సైతం కోర్టుకు తెలియజేసింది.
నీట్లో అక్రమాలు జరిగినందున మళ్లీ పరీక్ష నిర్వహించాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనలను విచారించిన కోర్టు.. స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్పందించిన కేంద్రం… నీట్ పరీక్షపై ఐఐటీ మద్రాస్ సాంకేతికంగా అధ్యయనం చేసిందని, దీని ప్రకారం పరీక్షలో మాస్ మాల్‌ప్రాక్టీస్ జరిగినట్టు ఎలాంటి సూచనలు లేవని అఫిడవిట్లో పేర్కొన్నది.
ఏ ఒక్క అభ్యర్థి కూడా పరీక్షలో అక్రమాల ద్వారా లబ్ధి పొందలేదని, కాబట్టి మళ్లీ పరీక్ష రాయాల్సిన భారం 23 లక్షల మంది విద్యార్థులకు అవసరం లేదని కోర్టుకు తెలియజేసింది. ఎవరైనా అక్రమాల ద్వారా లబ్ధి పొందినట్టు భవిష్యత్తులో తేలినా కౌన్సిలింగ్ ప్రక్రియ సమయంలోనైనా, ఆ తర్వాత అయినా ఆ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని పేర్కొన్నది.