న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత్ విద్యార్థులకు షాక్ తగిలింది. పంజాబ్, హర్యానా రాష్ర్టాల విద్యార్థుల దరఖాస్తులను తిరస్కరించాలని ఆస్ట్రేలియా అధికారులు, యూనివర్సిటీలు నిర్ణయించినట్టు టైమ్స్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇటీవల నకిలీ అడ్మిషన్ ఆఫర్ లెటర్లతో పట్టుబడ్డ పంజాబ్‌కు చెందిన 700 మంది విద్యార్థులను ఇండియా తిరిగి వెళ్లాలంటూ కెనడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ రెండు రాష్ర్టాల నుంచి వచ్చే విద్యార్థుల దరఖాస్తులను తిరస్కరించాలని ఆస్ట్రేలియా దేశీయ వ్యవహారాల శాఖ ఆయా యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులను రప్పించే సంస్థలను ఆదేశించింది. కాగా, కొందరు ఏజెంట్లు చేసిన నిర్వాకం వల్ల భారత్ విద్యార్థులు నష్టపోయారని, కెనడా, భారత్‌కు చెందిన పలు సంస్థలు కెనడా దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.