(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందాలనుకొన్న భారతీయుల కల కల్లగానే మారుతున్నది. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వలసవాద విధానాల్లో మొదలైన కఠిన ఆంక్షల అగ్గి.. ఇప్పుడు కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచమంతటా నిరసనల రూపంలో రాజుకొంటున్నది. వెరసి విదేశాల్లో భారతీయులకు సామాజిక, ఆర్థిక భద్రత లేకుండా పోతున్నది. దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామాల్ని ప్రధాని మోదీ దౌత్య వైఫల్యంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనవరి 20న అధికారంలోకి వచ్చింది మొదలు అక్రమ వలసలు, హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డు, జన్మతః పౌరసత్వ రద్దు, ఎఫ్1, ఓటీపీ.. ఇలా ప్రతీ అంశంలో ట్రంప్ సర్కారు తీసుకొంటున్న నిర్ణయాలు భారతీయులకు కునుకులేకుండా చేసున్నాయి. ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదాల్ని చూపిస్తూ విదేశీయులపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు.. ఇండియన్ల ‘డాలర్ డ్రీమ్స్’ను కల్లలుగా మారుస్తున్నాయి. భారతీయ వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకం విధింపు నిర్ణయం దరిమిలా యూఎస్-ఇండియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యేలా చేశాయి. ఈ క్రమంలో ట్రంప్ ఎన్నికల నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్(మాగా) ప్రచారకులు సోషల్ మీడియా వేదికగా భారత వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భారత్‌పై ట్రంప్ తీసుకొన్న తాజా చర్యలను గట్టిగా సమర్థిస్తున్న కన్జర్వేటివ్ ప్రముఖులు.. భారతీయ ఉద్యోగులతోపాటు కాల్ సెంటర్లపై కూడా ఆంక్షలకు పిలుపునిస్తున్నారు. ఇండియన్స్‌ను బయటకి పంపిస్తేనే, అమెరికన్లకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆందోళనలు చేస్తున్నారు.
వలసవాదులపై అమెరికాలో మొదలైన వ్యతిరేక నిరసనలు కెనడా, ఐరోపా దేశాలతో పాటూ ఆస్ట్రేలియా వరకూ వ్యాపించాయి. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరిట ఆ దేశంలోని పలు నగరాల్లో ఇటీవల వేలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాస్ ఇమ్మిగ్రేషన్ను నిలిపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక, ఐరోపా దేశాలైన జర్మనీ, ఇంగ్లండ్‌తో పాటు తాజాగా యూకేలోనూ వలసలకు సంబంధించిన వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. లండన్ వీధుల్లో ఏకంగా లక్షన్నర మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వార్సా, డబ్లిన్, బెర్లిన్ నగరాల్లోనూ వలస వ్యతిరేక ఆందోళనలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారతీయులు సహా విదేశీయులు వెంటనే తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని కెనడాలోనూ పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
విదేశాల్లో తాజాగా నెలకొన్న పరిస్థితులు భారత్ నుంచి బయటకు వెళ్లే విద్యార్థులు, వృత్తి నిపుణులు, చిరుద్యోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక భద్రతను సాకుగా చూయిస్తూ మొదలైన ఈ వలస వ్యతిరేక నిరసనలు.. జాతి విద్వేష దాడులకు ప్రేరేపించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా దేశాల్లో మైనార్టీలైన భారతీయులే లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు దిగజారక ముందే మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన పరిష్కారాలను ఎప్పుడో వెదకాల్సిందని చెప్తున్నారు. అయితే, భారతీయులపై దాడులు జరిగిన సందర్భంలో విదేశాంగ శాఖ కేవలం అడ్వైజరీలకే పరిమితం కావడంపై మండిపడుతున్నారు. మొత్తంగా ఇది మోదీ విదేశాంగ దౌత్యంలో అతి పెద్ద వైఫల్యమని అభివర్ణిస్తున్నారు.