CBSE | న్యూఢిల్లీ, జనవరి 26: నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాలుకు తీసుకువెళుతున్నట్టు గుర్తించిన విద్యార్థులను రెండేండ్ల పాటు బోర్డు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రకటించింది. పరీక్షల సందర్భంగా అక్రమాలకు జరగకుండా కఠినమైన విధానాన్ని అమలు చేస్తున్నామని ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్ష హాలులో దొరికిపోయిన విద్యార్థులు తక్షణ చర్యలు ఎదుర్కొంటారని, అన్ని సబ్జెక్టులలో వారి పరీక్షలను ఈ సంవత్సరంతో పాటు వచ్చే సంవత్సరం కూడా రద్దు చేస్తామని సీబీఎస్ఈ తెలిపింది.
అడ్మిట్ కార్డులు, పెన్నులు, అనలాగ్ వాచీలు వంటి అనుమతించిన జాబితాలోని వస్తువులను మాత్రమే విద్యార్థులు తీసుకురావాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది. ఉల్లంఘనలను నివారించడానికి పరీక్షా సెంటర్ల వద్ద భౌతిక తనిఖీ ప్రక్రియ సమగ్రంగా ఉంటుందని కూడా బోర్డు వెల్లడించింది. అంతేగాక పరీక్షకు సంబంధించిన వదంతులను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయకూడదని బోర్డు హెచ్చరించింది. పరీక్షకు సంబంధించిన అసలు లేదా నకిలీ సమాచారాన్ని షేర్ చేసిన విద్యార్థులు శిక్ష ఎదుర్కోక తప్పదని చెప్పింది. ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈకి చెందిన 10, 11వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యార్థులకు ప్రాథమిక గుర్తింపు విధానంగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీని అమలు చేయాలని సీబీఎస్ఈ పాఠశాలలకు తెలిపింది. ఈ ఐడీలో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. విద్యార్థుల విద్యా, ఇతర అంశాలకు సంబంధించిన రికార్డులను ఒకే చోట డిజిటల్ ప్లాట్‌ఫాంపై భద్రపరచడం దీని ఉద్దేశం.