Onions | ముంబై, ఆగస్టు 22: ఒక పక్క ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర భారీగా సుంకం విధించడాన్ని అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. వంటల్లో ప్రధానంగా వాడే ఉల్లిని రెండు నుంచి నాలుగు నెలల పాటు తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవని, అది వాడినా, వాడకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానేయ్యండి అని సూచించారు. ‘మీరు 10 లక్షల విలువైన వాహనాన్ని ఉపయోగించేటప్పుడు, రిటైల్ ధర కన్నా 10 నుంచి 20 రూపాయలకు ఎక్కువకు సరుకును కొనవచ్చు. అదేమీ మీకు పెద్ద భారం కాదు. అలా కాకుండా పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టమేమీ ఉండదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారులతో సరైన సమన్వయంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన సోమవారం అభిప్రాయపడ్డారు. ఒక్కొక్కప్పుడు క్వింటాల్ రూ.200 మాత్రమే లభించే ఉల్లిగడ్డ మరో సమయంలో రూ.2 వేల ధర పలుకుతుందని, దీని పరిష్కారానికి అందరితో చర్చలు జరపాలని ఆయన సూచించారు.
ముంబైకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తాం
ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్రం విధించిన 40% సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే ముంబైకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ మిత్రపక్షం రైతు క్రాంతి సంఘటన్ హెచ్చరించింది. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు, కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోనే అతిపెద్ద హోల్సేల్ ఉల్లి మార్కెట్ అయిన నాసిక్ వ్యాపారులు ఉల్లిగడ్డల వేలం పాటలను నిరవధికంగా నిలిపివేశారు.