ఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఈసారీ కేంద్రం చిన్నచూపు చూసింది. 9,754 కోట్ల లోటు బడ్జెట్‌తో నడుస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌కు ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు పెంచలేదు. గత బడ్జెట్లోలాగే 2025-26 బడ్జెట్లోనూ ఈ పథకానికి 86,000 కోట్లను కేటాయించారు. మొత్తంగా ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి కేంద్రం రూ.1.88 కోట్లను కేటాయించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లకు తాగునీటిని అందించటమే లక్ష్యంగా ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ను 2028 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తాజా బడ్జెట్లో జల్ జీవన్ మిషన్‌కు రూ.67 వేల కోట్లను కేటాయించింది. మిషన్‌లో భాగంగా చేపడుతున్న పథకాల నిర్వహణ, మౌలిక వసతుల నాణ్యత కోసం ‘జన్ బాగీధారి’ అనే పథకాన్ని తీసుకొస్తున్నామని అన్నారు.
అసెట్ మానిటైజేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ఆమె ప్రకటించారు. 2021లో ప్రకటించిన మొదటి అసెట్ మానిటైజేషన్ ప్లాన్ విజయవంతం అయ్యిందని, 2025-30 మధ్యకాలంలో రెండో ప్రణాళిక అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రణాళిక ద్వారా కొత్త ప్రాజెక్టుల కోసం రూ.10 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు.
బడ్జెట్లో కేంద్ర హోం శాఖకు రూ.2,33,210.68 కోట్లను కేటాయించారు. ఇందులో మళ్లీ అధిక భాగం(రూ.1.60 లక్షల కోట్లు) దేశ అంతర్గత భద్రత, సరిహద్దు కాపలాను పర్యవేక్షించే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర పోలీస్ దళాలకు కేటాయించారు.
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల బడ్జెట్లో కేంద్రం పెద్దగా మార్పులు చేయలేదు. నిరుడి బడ్జెట్‌తో పోల్చితే 2.41 శాతాన్ని పెంచుతూ తాజా పద్దులో రూ.2,87,333.16 కోట్లు కేటాయించింది.
వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించిన పీఎం స్వనిధి పథకాన్ని పునరుద్ధరించనున్నామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వారికి బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణం మొత్తాన్ని పెంచుతామని, రూ.30 వేల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తామని తెలిపారు.
అవినీతి నిరోధక న్యాయ దర్యాప్తు సంస్థ లోక్‌పాల్‌కు రానున్న ఆర్థిక సంవత్సరంలో(2025-26)లో రూ.44.32 కోట్లను కేంద్రం కేటాయించింది. నిరుడుతో పోలిస్తే 34 శాతం నిధులు తగ్గాయి.
ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతో ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సులువైన క్రెడిట్ యాక్సెస్ లక్ష్యంగా ఎగుమతుల ప్రమోషన్ మిషన్‌ను తీసుకురానున్నట్టు తెలిపారు.
ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు మూడో దశ కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు.