Abhishek Banerjee : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ నాయకుడు, బెంగాల్ మాజీ సీఎం మమతాబెనర్జి (Mamata Banerje) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhisheik Banerjee) కి లోక్‌సభ సెక్రెటేరియట్ వేళకాని వేళలో ఈ-మెయిల్ (E-Mail) పంపడంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. సోమవారం ఉదయం అభిషేక్ బెనర్జి ఇన్‌బాక్స్‌కు లోక్‌సభ సెక్రెటేరియట్ ఈ-మెయిల్ వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది రెబెల్ ఎంపీలు.. బెంగాల్‌కు చెందిన నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) లో విలీనం అవుతున్నట్లుగా సమాచారం ఇచ్చారని, దీనిపై అభిషేక్ బెనర్జీ రిప్లై ఇవ్వాలనేది ఆ ఈ-మెయిల్ సారాంశం.
అయితే లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి అభిషేక్ బెనర్జీకి ఈ-మెయిల్ వచ్చిన సమయంలో పోర్జరీ సంతకం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. రాత్రి 11 గంటల వరకు అభిషేక్ బెనర్జీని ఈడీ విచారించింది. కానీ లోక్‌సభలో సెక్రెటేరియట్ మాత్రం సాయంత్రం 4 గంటల వరకు రిప్లై ఇవ్వాలని ఈ-మెయిల్లో ఆదేశించింది. ఈడీ విచారణలో ఉన్న అభిషేక్ బెనర్జీకి అప్పుడు ఈ-మెయిల్ చూసే అవకాశం లేదు.
ఇదే విషయంపై తృణమూల్ సీనియర్ నేత కీర్తి ఆజాద్.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కార్యాలయానికి లేఖ రాశారు. అభిషేక్ బెనర్జీ ఈడీ కార్యాలయంలో ఉన్నారని, రాత్రి 11 గంటల వరకు విచారణ జరగనుందని, విచారణ అనంతరం ఆయనకు ఈ-మెయిల్ విషయం తెలియజేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే లోక్‌సభ సెక్రెటేరియట్ అభిషేక్ బెనర్జీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఈ-మెయిల్ పంపి.. రిప్లై కోసం తక్కువ గడువు ఇచ్చారని విమర్శించారు.