ఇండోర్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మరో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఇండోర్ పరిధిలో గల ఖజ్రానాలో ఆరేండ్ల క్రితం (2020)మంజూరైన ఓ ప్రభుత్వ దవాఖాన కేవలం కాగితాలకే పరిమితమయ్యింది. అయితే దవాఖాన పేరుతో ఏకంగా 87 ప్రభుత్వ పోస్టులు మంజూరు కావడం, నియామకాలు, బదిలీలు యథేచ్ఛగా జరిగిపోతుండటం విశేషం.
2020 జూన్ 23న ప్రభుత్వం 100 పడకల సివిల్ దవాఖానను మంజూరు చేసింది. అయితే తగిన స్థలం దొరక్కపోవడంతో దవాఖాన నిర్మాణం ప్రారంభం కాలేదు. అయితే ప్రభుత్వ పోర్టల్‌లో ఈ దవాఖానను ఉన్నట్లే చూపిస్తూ, అధికారులు వివిధ పోస్టింగ్‌లు, బదిలీలు చేపడుతున్నారు. తాజాగా ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను ఈ దవాఖానకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.
ఇక్కడ దవాఖాన లేకపోవడంతో ఇక్కడ నియమితులైన సిబ్బంది స్థానికంగా ఉన్న ఇతర ప్రభుత్వ దవాఖానలకు బదిలీ చేస్తుండటం ఇంకా విచిత్రం. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర శుక్లా మాట్లాడుతూ మొదట అర్బన్ ప్రైమరీ సెంటర్‌గా ఉన్న ప్రతిపాదనను ఆ తర్వాత 50 పడకల సివిల్ దవాఖానగా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. దవాఖాన నిర్మాణం కోసం తగిన స్థలాన్ని అన్వేషిస్తున్నామని, ఈలోపు ఇక్కడ నియమితులైన సిబ్బందిని ఇతర ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేస్తున్నామన్నారు.