Nitish Statement | రాహుల్‌గాంధీని దృష్టిలో పెట్టుకుని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధానమంత్రి పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేజస్వితో కలిసిన సందర్భంలో చెప్పిన నితీష్.. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి ఆ వ్యాఖ్యలను పునరావృతం చేశారు. విపక్షాలతో చర్చించకుండానే ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. విపక్షాలను ఏకం చేసే పనిలో ఉంటానన్న నితీష్.. ప్రస్తుతానికి ఆ పనినే మర్చిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రధాని పదవి రేసులో తాను లేనని నితీష్ కుమార్ మరోసారి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలంటూ కమల్ నాథ్ ప్రకటనపై నితీశ్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం పాట్నాలోని జ్ఞాన్భవన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్లకు నియామక పత్రాలు అందించేందుకు వచ్చారు. అక్కడి జర్నలిస్టులు నితీష్‌ను చుట్టుముట్టి.. రాహుల్ గాంధీ ప్రతిపక్ష వ్యక్తి కాగలడా? అని ప్రశ్నించారు. దీనిపై ఆయన చిరునవ్వు నవ్వుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని అన్నారు. తనకు ప్రధాని కావాలనే కోరిక లేదని, తాను ఆ రేసులో లేనని వెల్లడించారు.
అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని నితీశ్ పిలుపునిచ్చారు. మరిన్ని పార్టీలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. మనం కలిసి కదులుతేనే అంతా సెటిల్ అవుతుందని తెలిపారు. అందరం కలిసి సమావేశమైనప్పుడు ఆ విషయాలను చర్చించుకుంటామని స్పష్టం చేశారు. విపక్షాలు ఏకమైతే ఎంతటి శక్తినైనా కదిలించవచ్చునన్నారు. ఇందుకు పొరపొచ్చాలు వీడి ముందుకు రావాలని సూచించారు.