పాట్నా: బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్‌కు (Nitish Kumar) దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం జరిగిన జేడీ(యూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా ఈ మేరకు బ్యానర్లు వెలిశాయి. నితీశ్ కుమార్‌కు భారత రత్న ఇవ్వాలని పేర్కొంటూ ఆ పార్టీ నేత చోటూ సింగ్ వీటిని ఏర్పాటు చేశారు. ‘బీహార్‌కు చెందిన ప్రఖ్యాత సోషలిస్టు వ్యక్తి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి’ అని ఆ బ్యానర్లలో పేర్కొన్నారు. జేడీ(యూ) కార్యాలయం బయట, పాట్నాలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ బ్యానర్లు కనిపించాయి.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషలిస్ట్ ఆదర్శాలతో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిన నేతగా నితీశ్ కుమార్‌ను హైలైట్ చేసేందుకు జేడీ(యూ) ప్రయత్నిస్తున్నది. 2005 నుంచి సుమారు 19 ఏళ్లు సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్, బీహార్‌లో మద్యాన్ని నిషేధించడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.
మరోవైపు మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా నితీశ్ కుమార్ పనిచేశారు. రైల్వే, వ్యవసాయం వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో నితీశ్ కుమార్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు భారత రత్న ఇవ్వాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తున్నది.