Bihar CM Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్‌కు తమ తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యపై జేడీయూ సీనియర్ నేత నితీశ్ స్పందించారు. మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసే ప్రసక్తి లేదన్నారు. మళ్లీ ఆ పొరపాటు చేయబోనని చెప్పారు. గతంలో 2014 ఎన్నికల తర్వాత, 2020 తర్వాత రెండు దఫాలు ఆర్జేడీ సారధ్యంలోని గ్రాండ్ అలయెన్స్‌లో జనతాదళ్ యూ నేత నితీశ్ కుమార్ జత కట్టారు. కానీ కూటమి పక్షాల మధ్య విభేదాలతో ఆయన తిరిగి బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏలో చేరారు.
‘పవర్ కోసం ఎవరైనా ఏమైనా చేస్తారు. కానీ సూర్యాస్తమయం తర్వాత ఇంటి నుంచి బయటకు రావడానికి భయ పడతారు. వారితో పలుసార్లు కలిసి పొరపాటు చేశాను’అని నితీశ్ కుమార్ ఆదివారం మీడియాతో చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తమ సీఎం అభ్యర్థి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్.. నితీశ్ కుమార్‌కు మహా కూటమి తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. గత ఏప్రిల్-జూన్ నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి బీజేపీ కొద్ది దూరంలో నిలిచింది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ మద్దతు కీలకంగా మారింది.