న్యూఢిల్లీ, మార్చి 6: దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుదలకు సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు తయారుచేసిన నాసిరకం డీపీఆర్‌లు, లోపభూయిష్టమైన రోడ్డు డిజైన్లే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిందించారు. గురువారం నాడిక్కడ గ్లోబల్ రోడ్ ఇన్ఫ్రాటెక్ సమ్మిట్, ఎక్స్పో(జీఆర్ఐఎస్)లో ఆయన ప్రసంగిస్తూ దేశంలో రోడ్డు భద్రతా చర్యలను మెరుగుపరచవలసిన తక్షణావసరం ఉందని స్పష్టం చేశారు.
చిన్న చిన్న సివిల్ పొరపాట్లు, లోపభూయిష్టమైన డీపీఆర్‌ల కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకు ఎవరినీ బాధ్యులను చేయలేమని గడ్కరీ అన్నారు. రోడ్డు భద్రతను పెంచడానికి కొత్త వ్యూహాలను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
మన దేశంలో రోడ్డు సూచికలు, మార్కింగ్ విధానాలు వంటి చిన్న విషయాలు కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి మనం చాలా నేర్చుకోవలసింది ఉందని చెప్పారు. దేశంలో అత్యంత చెత్త డీపీఆర్‌లు తయారవుతున్నాయని, ఇందుకు ఇంజనీర్లే ప్రధానంగా బాధ్యులని గడ్కరీ చెప్పారు. నాసిరకం ప్లానింగ్, డిజైన్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు.